సమస్యల సుడిగుండంలో ఆంధ్ర యూనివర్సిటీ

సమస్యల సుడిగుండంలో ఆంధ్ర యూనివర్సిటీ

తొంభై నాలుగేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నో విజయ పతాకాలు. ఎందరో మహానుభావులును అందించిన కళామతల్లి మన ఆంధ్ర విశ్వవిద్యాలయం.

సి .ఆర్. రెడ్డి, మొదటి ఉప రాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ ల సారథ్యంలో నడిచిన నేల మన ఆంధ్ర విశ్వకళా పరిషత్. నేటి మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని అందించిన ఘనత మన విశ్వ విద్యాలయానిదే.

ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ లను, మరెంతో మంది న్యాయమూర్తులను, న్యాయవాదులను, వ్యాపారవేత్తలను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇంజనీర్లను, వైద్యులను ఇంకెంతో మంది మేధావులను, అధికారులను, కళాకారులను అందించింది మన ఈ కళామతల్లి. నేటికీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లో విద్యను అభ్యసించడం ఎంతో మంది విద్యార్థులకు ఒక కళ. సుందర సాగర తీరాన అదో అద్భుత ప్రపంచం. మన రాష్ట్రం నలుమూలల విద్యార్థులకు మాత్రమే పరిమితం కాకుండా దేశవిదేశాల విద్యార్థులను కూడా విద్యాకుసుమాలు గా తీర్చిదిద్దిన ఘనత మన విద్యాలయానిదే.

అంతటి ఘనత ఉన్న విద్యాలయం నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఏటా పెరుగుతున్న కోర్సులు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి గృహాల సంఖ్య పెరగకపోవడంతో విద్యార్థులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య విద్యార్థినుల విషయానికి వస్తే మరీ దారుణంగా ఉంది. చిన్న గదుల్లో నలుగురైదుగురు విద్యార్థినుల సర్దుకుని ఉండాల్సిన పరిస్థితి. వసతి గృహాల్లో భోజనాలు రక్తహీనతకు కేంద్రాలు ఏర్పరిచే మార్గాలు. దొడ్ల విషయానికి వస్తే శుభ్రత కరువై వివిధ రకాల వ్యాధులకు చిరునామాలు గా మారుతున్నారు. అసలు విభాగాల విషయానికి వస్తే మంచినీరు మరుగుదొడ్ల సౌకర్యం ఒక అందని ద్రాక్షలా కనిపిస్తుంది.

మహారాణి పేట బాలికల వసతి గృహం నుండి విభాగాలకు రావలసిన విద్యార్థినులకు బస్సుల సరిపడా లేకపోవటం కొత్త బస్సులు కొనే పరిస్థితి లేక విభాగాల సమయాలలో మార్పు చేసుకునే దుస్థితికి నెట్టివేయడం జరిగింది. ప్రతి ఏట పెరుగుతున్న రుసుము చెల్లించలేక పేదవారు విద్యకు దూరమవుతున్నారు. చదువులుకు మధ్యలోనే తిలోదకాలు ఇస్తున్నారు. తర్వాతి అంశం భోధనా సిబ్బంది ఇదే విశ్వవిద్యాలయానికి ఉన్న పెద్ద ఇబ్బంది. చాలా కాలంగా ఖాళీలు భర్తీ కాక ఉన్న సిబ్బంది పదవి విరమణ పొందుతున్న కారణంగా సిబ్బంది లేమితో నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు.

ఉదాహరణకు చరిత్ర విభాగం చూసినట్లయితే బోధనా సిబ్బంది లేకుండా కేవలం పరిశోధకులతో మాత్రమే విభాగం నడుస్తుందంటే అది దిగజారిన విద్యా ప్రమాణాలకు నిలువెత్తు నిదర్శనం. ఇదే కోవలో పయనించు టకు అనేక విభాగాలు సిద్ధమవుతున్నాయి అనే వాస్తవం విశ్వవిద్యాలయ భవితవ్యానికి ఒక ప్రశ్నార్థకం. బోధన సిబ్బందిని భర్తీ చేయకపోవడం అన్నది కేవలం విద్యార్థులపై మాత్రమే ప్రభావం చూపదు అది పరిశోధనలు మరియు పరిశోధకుల పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పరిశోధనలు అంతంతమాత్రంగా, కొద్ది మందికి ఉపాధి గా ఉన్నవి, అవి కాస్త కనుమరుగవుతాయి.

పరశోధనలు లేని విశ్వవిద్యాలయం ఊహించటానికి కూడా ఉండదు. పరిశోధనలు చేసే అందరికి ఫెలోషిప్ లుండవు దానితో పరిశోధనను కొనసాగించటం అన్నది కత్తి మీద సాము చేయటం వంటిది. దీనితో చాలమంది పరిశోధనలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. ఇదే కొనసాగినట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి ఉండేది అని మన భవిష్యత్ తరాలకు చెప్పుకోవాల్సి వస్తోంది. ఇంతటి దౌర్భాగ్యం రాకుండా ఉండాలంటే బోధనా సిబ్బంది భర్తీ జరగాలి. అది మాత్రమే కాదు బోధనేతర సిబ్బంది విషయానికి వస్తే ఉదాహరణకు విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన గ్రంధాలయంలో 5 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి అవి దుమ్ము కొట్టుకుపోతున్న సరే పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇక్కడ బోధనేతర సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ అంతంతమాత్రంగా మారిపోయింది.

తాళపత్ర గ్రంధాలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మొదట ప్రతి ఉన్నటువంటి గ్రంథాలయం నేడు నిర్వహణలో పెంచడం అన్నది బాధాకరం. బోధనేతర సిబ్బంది భర్తీ చేయటం వలన మాత్రమే ఈ ఇబ్బందిని అధిగమించడం సాధ్యం. వివిధ విభాగాలకు గ్రంథాలయాలు ఉన్నప్పటికీ న్యాయ కళాశాల, సోషల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇన్క్లూజన్ పాలసీ, ఉమెన్ స్టడీస్ మరియు మరో రెండు మూడు భాగాలలో మాత్రమే గ్రంథాలయ నిర్వహణ సక్రమంగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు. ఇవి చాలవన్నట్టు నానాటికి దళిత, దళితేతర కులాల మధ్య మాటల తూటాలు, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతీయ రాజకీయాలకు అడ్డాగా మారుతుంది.

ఆచార్యుల పై తోటి పరిశోధకుల పై ఆకాశరామన్న ఉత్తరాలు కు కేంద్రంగా మారుతోంది. విద్యార్థులు, పరిశోధకుల సమస్యలు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్న బ్రోకర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. చదువులు పూర్తయినప్పటికీ వర్సిటీ రాజకీయాలు చేయడానికి విద్యాలయాన్ని పట్టుకొని వ్రేలాడే చీడపురుగులు యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. వీరిని ఏరిపారితే గాని విశ్వవిద్యాలయ ప్రతిష్టను కాపాడలేని పరిస్థితి దాపురించింది.
వేల మందికి ఉపాధిని కల్పిస్తూ, లక్షలాది మంది ఇంట విద్యా , ఉపాధి దీపాన్ని వెలిగించిన విద్యాలయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. సేవ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం అండ్ సేవ్ అవర్ ఫ్యూచర్..

జి ప్రియాంక

Home » ప్రతిభ » సమస్యల సుడిగుండంలో ఆంధ్ర యూనివర్సిటీ

2 thoughts on “సమస్యల సుడిగుండంలో ఆంధ్ర యూనివర్సిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *